అమల్లోకి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సంకల్పం
9 రకాల కనీస వసతులతో సర్కారు బడులకు మహర్దశ
ఒంగోలులో పనులకు ప్రారంభం
తొలిదశలో 15,715 పాఠశాలల్లో అమలు
ప్రతి పంచాయతీ నుంచి కనీసం ఒక పాఠశాల ఎంపిక, అర్బన్, గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు కూడా
ప్రస్తుత పాఠశాలల పరిస్థితి... మార్పు తరువాత పరిస్థితిని ఫోటోలతో వివరించనున్న ప్రభుత్వం
మూడేళ్లలో 44,512 స్కూళ్ల రూపురేఖల్లో సమూల మార్పులు
''మనబడి నాడు-నేడు"" కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంలో కీలక మార్పులకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సర్కారు బడుల రూపురేఖలే మారిపోనున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు... మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు చేరువ చేసేందుకు... శ్రీ వైఎస్ జగన్ సర్కార్ మూడు విడతల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నడుంబిగించింది. నేడు ప్రభుత్వ పాఠశాలలు వున్న పరిస్థితిని... మార్పు తరువాత అదే పాఠశాల పరిస్థితిని కళ్ళకు కట్టేలా ఫోటోలు తీసి మరీ ప్రజల ముందు ప్రదర్శిస్తామంటూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం ద్వారా ఈ కార్యక్రమంపై తమ చిత్తశుద్దిని చాటుకున్నారు.
ఒంగోలులో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదిగా బాలల దినోత్సవం రోజునే ''నాడు-నేడు'' కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల లేమి అనే మాట వినిపించ కూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికను సిద్దం చేసింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్, మున్సిపల్, పాఠశాల విద్య, గిరిజన సంక్షేమం, బిసి సంక్షేమం, సాంఘిక సంక్షేమం, జువైనల్ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో మొత్తం 44,512 పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిల్లో 33,797 ప్రాథమిక, 4,215 ప్రాథమికోన్నత, 6510 ఉన్నత పాఠశాలలు వున్నాయి. తొలిదశలో రాష్ట్రంలోని 15,715 పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో 9795 ప్రాథమిక, 3110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2810 ఉన్నత పాఠశాలలు వున్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో అధికంగా విద్యార్ధులు వున్న పాఠశాలలను నాడు-నేడు కార్యక్రమంలోని మొదటి దశలో ఎంపిక చేశారు. వీటితో పాటు శిధిలావస్థలో వున్న పాఠశాలలు, నూతనంగా నిర్మించాల్సిన పాఠశాలలు, అసంపూర్తిగా వున్న పాఠశాలలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అదే విధంగా ఉన్నత పాఠశాలల్లో 250 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్ధులు వున్న పాఠశాలలకు కూడా మొదటిదశలో అవకాశం కల్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో...
1. రన్నింగ్ వాటర్ తో కూడిన టాయిలెట్లు
2. విద్యుదీకరణతో పాటు ఫ్యాన్లు, లైట్లు
3. మంచినీరు
4. విద్యార్ధులు, పాఠశాల సిబ్బందికి అవసరమైన ఫర్నీచర్
5. మొత్తం పాఠశాలకు పెయింటింగ్
6. మేజర్, మైనర్ మరమ్మతులు
7. గ్రీన్ చాక్ బోర్డ్ లు,
8. అదనపు తరగతి గదులు
9. ప్రహరీ గోడ నిర్మాణం... వంటి తొమ్మిది రకాల వసతులను ''మనబడి నాడు-నేడు'' కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్నారు. 418 మండలాల్లో సర్వశిక్షాభియాన్, 263 మండలాల్లో ఎపి ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ర్ఫాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, 49 మండలాల్లో గిరిజన సంక్షేమశాఖ ద్వారా మొదటిదశలో ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకురావడం ద్వారా పేద, మద్యతరగతి విద్యార్ధులు కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంను ప్రభుత్వం ప్రకటించింది. విద్యతో పాటు ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా, ఇంకా చెప్పాలంటే కార్పోరేట్ స్కూళ్లను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంను జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని, అలాగే జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అలాగే వేసవి సెలవుల తరువాత బడులు తెరవగానే యూనిఫారంలు, వాటి కుట్టుకూలి డబ్బులు, షూలు కొనుగోలు చేసేందుకు నగదు, ఉచితంగా పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటు విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు వుండేలా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ఇప్పటికే విద్యాశాఖా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని సక్రమంగా వుండేలా చూడటం వల్ల విద్యాబోధనలో ఉన్నత ప్రమాణాలను సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.