వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత 'చంద్రబాబు'బాటలో నడుస్తున్నారా..? 'చంద్రబాబు' తీసుకున్నట్లే రాజకీయ నిర్ణయాలను 'జగన్' కూడా తీసుకుంటున్నారా..? ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులను పార్టీలో చేర్చుకోవడంలోనూ, వివిధ సామాజికవర్గాలకు చెందిన వారిని పార్టీలోకి ఆకర్షించేందుకు, ప్రత్యర్థులపై విమర్శలు చేసేందుకు సామాజికవర్గాల వారీగా నాయకులను ఎంపిక చేయడంలోనూ, తన ప్రత్యర్థి సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నాయకులను పార్టీలోకి తీసుకువచ్చి వారితో విమర్శలు చేయించేందుకు 'నాడు' 'చంద్రబాబు' అనుసరించిన వ్యూహాన్నే 'జగన్' అనుసరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
2014 అసెంబ్లీఎన్నికల్లో టిడిపి విజయం సాధించిన తరువాత...ప్రత్యర్థి పార్టీ అయిన వైకాపాను 'చంద్రబాబు' ముప్పుతిప్పలు పెట్టారు. ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని వలసలను ప్రోత్సహించారు. పలువురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ముఖ్యంగా వైకాపా అధినేత 'జగన్మోహన్‌రెడ్డి' సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. కడప జిల్లాలో బలమైన నాయకుడైన 'ఆదినారాయణరెడ్డి'ని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారు. అదే విధంగా 'కర్నూలు' జిల్లాలో 'భూమానాగిరెడ్డి', ఆయన కుమార్తె 'అఖిలప్రియ'ను చేర్చుకుని 'నాగిరెడ్డి' మరణించిన తరువాత 'అఖిలప్రియ'కు మంత్రి పదవి ఇచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 'రెడ్డి' సామాజికవర్గ ఓటర్లు టిడిపికి ఓటు వేయలేదని, వారంతా గంప గుత్తగా వైకాపాకే ఓటు వేశారని భావించిన 'చంద్రబాబు' ఆ సామాజికవర్గ ఎమ్మెల్యేలను, నాయకులను పార్టీలో చేర్చుకుని బలపడాలని యత్నించారు. మొదట్లో వైకాపాకు చెందిన 'రెడ్డి' సామాజికవర్గ ఎమ్మెల్యేలు వైకాపాని వీడి టిడిపిలో చేరుతున్నప్పుడు ఆ పార్టీ పని అయిపోయిందని, స్వంత సామాజికవర్గమే పార్టీని వదిలేస్తే...ఇక ఆ పార్టీకి మనగడ కష్టమనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరిచారు. కానీ..2019 నాటికి వారి అంచనాలు తప్పయ్యాయి. 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరినా...వైకాపా ఏమీ బలహీనపడిపోలేదు. పైగా బ్రహ్మాండమైన మెజార్టీలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఒక సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులను పార్టీలో చేర్చుకుంటే ఆ సామాజికవర్గానికి చెందిన వారంతా ఓట్లు వేస్తారనే అభిప్రాయం తప్పని మొన్నటి ఎన్నికలు నిరూపించాయి.
2019 ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయ పార్టీలు ఈవిషయమై స్పష్టత వచ్చినా...ప్రత్యర్థి పార్టీని బలహీనపర్చేందుకు అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం వైకాపా అధినేత 'జగన్మోహన్‌రెడ్డి' కూడా 'చంద్రబాబు' బాటలోనే నడుస్తున్నారు. నాడు తన సామాజికవర్గాన్ని 'చంద్రబాబు' టార్గెట్ చేసి పార్టీలో చేర్చుకున్న వ్యూహాన్నే నేడు 'జగన్' అనుసరిస్తున్నారు. 'కమ్మ' సామాజికవర్గానికి బాగా పట్టున్న 'కృష్ణా' జిల్లాలో 'జగన్' 'చంద్రబాబు' వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. టిడిపికి బలమైన నాయకులు ఉన్న ఈ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులపై ఆయన గురిపెట్టారు. గన్నవరం ఎమ్మెల్యే 'వంశీమోహన్', దేవినేని అవినాష్‌ను పార్టీలో చేర్చుకుని 'చంద్రబాబు'కు స్వంత సామాజికవర్గంలోనే బలం లేదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు బలమైన నాయకులను ఆకర్షించిన 'జగన్' రాబోయే కాలంలో ఆ సామాజికవర్గానికి చెందిన మరి కొందరిని పార్టీలో చేర్చుకోబోతున్నారు. దీంతో..'చంద్రబాబు' సామాజికవర్గాన్ని తనవైపు తిప్పుకుని...రాజధాని ప్రాంతంలో తనకు ఎదురులేకుండా చూసుకోవాలనే భావనతో ఉన్నారు. అదే సమయంలో రాబోయే ఎన్నికల నాటికి టిడిపికి బలమైన అభ్యర్థులు లేకుండా చూడాలనే వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారు. అయితే నాయకులను, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే సామాన్య ప్రజలు, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీలు మారతారా..? అంటే మారరనే గత సార్వత్రిక ఎన్నికలు నిరూపించాయి. చరిత్ర పాఠాలు చెబుతున్నా...రాజకీయ నాయకులు మాత్రం వాటి నుంచి పాఠాలు నేర్చుకోరు.